ఓటీఎస్ ద్వారా రూ.10 వేల కోట్ల రుణాలు మాఫీ.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల మేరకు పేదల రుణాలను మాఫీ చేస్తోందని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. బుధవారం విజయవాడలో సంస్థ ఎండీ భరత్ గుప్తతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1983 నుంచి 2011 వరకూ గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు తీసుకొని ఇళ్లు నిర్మించుకున్న వారి అసలు, వడ్డీ కలిపి రూ.14 వేల కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఓటీఎస్ రూపంలో పేదలకు వడ్డీ, అసలు రెండింటికీ రాయితీ ఇచ్చి నిర్ణీత మొత్తాలు చెల్లించిన వారికి ఆస్తులపై సంపూర్ణ హక్కులు కల్పిస్తోందని వివరించారు. 22–ఏ లిస్ట్‌లో ఉన్న స్థలాలను ఆ జాబితా నుంచి తొలగించి, ఎలాంటి యూజర్, స్టాంప్ చార్జీలు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు తెలిపారు.
సాధారణంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో విలువపై 7.5% చెల్లించాలని, రిజిస్ట్టర్ కార్యాలయాల దగ్గర పడిగాపులు కాయాల్సి ఉంటుందన్నారు. ఇప్పుడు 7.5% చార్జీలు లేకుండా, ఎక్కడా వేచి ఉండాల్సిన అవసరం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తుందన్నారు. డీ పట్టా, పొజిషన్ సర్టిఫికెట్ స్థలాలను 22–ఏ లిస్టులో నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల స్థలం, ఇంటి విలువపై 75% వరకు బ్యాంక్ రుణం పొందే సదుపాయం ఉంటుందన్నారు. బ్యాంక్‌లతో సంప్రదించి రుణాలు పొందడానికి వీలుగా రిజిస్ట్రేషన్ పత్రాలు సిద్ధం చేశామని (వెట్టింగ్) చెప్పారు.
గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు తీసుకోని వారు 12 లక్షల మంది ఉన్నారని, వీరు కేవలం రూ.10 చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 8 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని, 21న సీఎం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ ప్రారంభిస్తామన్నారు. తొలి విడతలో వాస్తవ హక్కుదారులు, వారి వారసుల ఆధీనంలో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నామన్నారు. రెండో విడతలో చేతులు మారిన ఇళ్లపై విచారణలు జరిపి, ఉత్తర్వులు అందాక రిజిస్ట్రేషన్లు చేస్తామని వివరించారు.
స్వచ్ఛందంగా వచ్చిన వారికే రిజిస్ట్రేషన్
స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని, అర్హులపై ఒత్తిళ్లు ఉండవన్నారు. ఎవరైనా హక్కులు పొందడానికి ముందుకు రాకపోతే ఎటువంటి బలవంతం చేయడంలేదని తెలిపారు. ఓటీఎస్‌కు ముందుకు రాని వారి పింఛన్లు నిలిపివేయాలని శ్రీకాకుళం జిల్లాలో సర్క్యులర్ జారీ చేసిన పంచాయతీ సెక్రటరీపై చర్యలు తీసుకున్నామన్నారు. ఓటీఎస్ వినియోగించుకోకపోతే ఇతర పథకాలు ఆగిపోతాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పథకం ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయాలని, ఒత్తిడి తీసుకురావద్దని కలెక్టర్లు, జేసీలను ఆదేశించామన్నారు.
అనేక వినతులు అందాయి
చివరిసారిగా రాష్ట్రంలో 2014లో ఓటీఎస్ అమలు జరిగిందని అజయ్ జైన్ చెప్పారు. అనంతరం ప్రజాప్రతినిధులు, రుణ గ్రహీతల నుంచి ఓటీఎస్ అమలు చేయాలని అనేక వినతులు అందాయని తెలిపారు. ఈ నేపథ్యంలో 2016లో ఓటీఎస్ అమలుకు గృహ నిర్మాణ శాఖ కార్యవర్గం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిందన్నారు. అయితే అప్పటి ప్రభుత్వం అమలుపై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం వడ్డీ, అసలు రెండింటికీ రాయితీ ఇచ్చి పథకాన్ని అమలు చేస్తోందని వివరించారు.
ఓటీఎస్‌పై దుష్ప్రచారం చేస్తే చర్యలు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వన్ టైం సెటిల్‌మెంట్(ఓటీఎస్)పై జరుగుతున్న దుష్ప్రచారంపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘ఈ పథకం ద్వారా లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరుతుంది. చట్టపరంగా హక్కులు దఖలు పడతాయి. ఇంతలా మేలు చేసే పథకంపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారుల్లో సందేహాలు, అనుమానాలు ఉంటే అధికారులు అవగాహన కల్పించాలి. పథకం వల్ల కలిగే మేలు లబ్ధిదారులకు చూపించాలి’ అని వివరించారు. సీఎంవో అధికారులతో సమావేశమై ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
ఓటీఎస్ స్వచ్ఛందమే:
వివిధ గృహ పథకాల కింద రుణాలు తీసుకుని చెల్లించని లబ్ధిదారులకు ఓటీఎస్‌ను స్వచ్ఛంద విధానంలోనే అమలు చేస్తున్నట్లు గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. లబ్ధిదారులపై ఎలాంటి ఒత్తిడి లేదని, సంక్షేమ పథకాలతో దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. పథక ప్రయోజనాలను లబ్ధిదారులకు వివరించేందుకే వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి లక్ష్యాన్ని నిర్దేశించామని పేర్కొన్నారు. విజయవాడలోని ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో బుధవారం అజయ్‌జైన్ మాట్లాడుతూ.. ‘ఓటీఎస్ కొత్త పథకం కాదు. 2014 వరకు అమల్లో ఉంది. అప్పట్లో కేవలం లబ్ధిదారులు తీసుకున్న రుణంపైన వడ్డీని మాత్రమే మినహాయించారు. ఇప్పుడు మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తూ పథకాన్ని మళ్లీ అమలు చేసేందుకు సీఎం జగన్ నిర్ణయించారు. ప్రస్తుత నిబంధల ప్రకారం లబ్ధిదారుడు తీసుకున్న రుణం, దానిపై వడ్డీ ఎంత ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పురపాలక సంఘాల్లో రూ.15 వేలు, నగర పాలక సంస్థల్లో రూ.20 వేలు కడితే రుణ విముక్తి పత్రాన్ని అందిస్తాం. అసలు, వడ్డీ కలిపి రూ.10 వేల కంటే తక్కువగా ఉంటే... ఆ మొత్తాన్ని చెల్లించినా సరిపోతుంది. 22(ఏ) నిషేధిత జాబితాలోని భూములకూ రిజిస్ట్రేషన్ చేయిస్తాం. ఓటీఎస్ విధానాన్ని మొదటి విడతలో రుణం తీసుకున్న లబ్ధిదారులు, వారి వారసులకు, ప్రభుత్వ పథకాల్లో ఇళ్లు మంజూరై సొంతంగా నిర్మించుకున్న వారికే పరిమితం చేస్తున్నాం. వీటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 8 నుంచి ప్రారంభిస్తాం. 21న రిజిస్ట్రేషన్ పత్రాలను సీఎం జగన్ లబ్ధిదారులకు అందిస్తారు. చేతులు మారిన ఇళ్లకు రెండో విడతలో ఓటీఎస్ అమలు చేస్తాం’ అని వెల్లడించారు.
సంతబొమ్మాళిలో జరిగింది.. కుట్రలా ఉంది : మంత్రి బొత్స‘ఎవరి ప్రలోభానికి గురై సంతబొమ్మాళి పంచాయతీ కార్యదర్శి ఓటీఎస్‌పై సర్క్యులర్ జారీ చేశారో..? ఆ కుట్ర వెనుక ఉన్నదెవరో అన్నీ ప్రజల ముందుంచుతాం’ అని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం వైకాపా కేంద్ర కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. ‘తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియోజకవర్గంలోని కార్యదర్శి సర్క్యులర్ ఇవ్వడం, దానిపై వెంటనే చంద్రబాబు, లోకేశ్ ట్వీట్లు చేస్తూ ప్రజలను గందరగోళ పరిచే ప్రయత్నం చేయడం చూస్తుంటే ఇదంతా ప్రణాళిక ప్రకారం చేసిన కుట్రగా ప్రజలకు అర్థమైంది’ అని విమర్శించారు. ఓటీఎస్ అనేది పూర్తిగా లబ్ధిదారుల ఐచ్ఛికమేనన్నారు. వసూళ్లపై వాలంటీర్లు, కార్యదర్శులకు లక్ష్యాలు నిర్దేశించలేదని, కేవలం అవగాహన కల్పించాలని ఆదేశించామని వివరించారు.
You must be logged in to post a comment.